Thursday, March 4, 2010

సర్దుకపో!



ఎక్కడికక్కడ

ఎప్పటికప్పుడు

సర్దుకపో!


కత్తుల బోనులో విసిరేయబడ్డా


కుట్రల మధ్య కవాతుకు నిలబెట్టబడ్డా


చౌకబారు రాజకీయం రంగులు వెలసిన వస్త్రాన్ని నీపై కప్పేసినా


చీడబట్టిన సమాజాన్ని బాగుచేయలేకపోయినా


ఎక్కడికక్కడ


ఎప్పటికప్పుడు


సర్దుకపో!


నీ తత్వానికి సరిపడని విధంగా బ్రతకాల్సివచ్చినా


ఆదర్శప్రాయుడిగా వెలుగొందలేకపోయినా


లౌకిక రాజ్యంలో ఇహపర భోగాలలో మునిగితేలినా


అభ్యుదయ భావాల్ని గాలికొదిల్చి పెనునిద్దర నిన్ను వశపర్చుకున్నా


ఎక్కడికక్కడ


ఎప్పటికప్పుడు


సర్దుకపో!


సంస్కరణలు బహిరంగ పారాయణానికి మాత్రమే పనికివచ్చినా


నిబద్ధతకు నీళ్ళొదలాల్సి వచ్చినా


భావజాలంలో సునామీ పుట్టి...ద్రుక్పధాలలో మార్పు సంభవించినా


అవినీతి, అక్రమాలు, అరాచకం నీ చుట్టుపక్కల స్వైర్యవిహారం చేసినా


ఎక్కడికక్కడ


ఎప్పటికప్పుడు


సర్దుకపో!


అవ్యక్త తాపసివై


భావప్రకంపనలు లేని నిలువెత్తు బండరాయివై


సిద్ధాంతాలకు సిలువేసిన ఘరానా దొంగవై


ఎక్కడికక్కడ


ఎప్పటికప్పుడు


సర్దుకపో


సరే....కానీ….


సర్దుకపో!


నీ ఒక్కడి నిబద్ధతే


సమాజపు కొలబద్ద కాదుగా


సరే....కానీ


సర్దుకపో!

1 comment:

  1. ప్రస్తుత సమాజంపై మీరు ఎక్కుపెట్టిన "సర్దుకుపో!" sssoooppperb
    అండి,CURVE గారు.
    మీ స్వగతంలో-humour,honest and truth-అనే పదాలను చూసిన తర్వాతనే మీ బ్లాగ్ ఓపెన్ చేసానండి. అందులో సర్దుకుపో తెగ నచ్చిందండి.నేను కూడా ఇవే ఫాలో అవుతానండి.
    నా బ్లాగ్ :మనము ఏమీ చేయలేమా...?- చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు

    ReplyDelete